Merugu Nagarjuna: ఏపీలో ప్రజాస్వామ్యం నలిగిపోతోంది 6 d ago

AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అపహాస్యం అవుతోందన్నారు వైసీపీ నేత మేరుగు నాగార్జున. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, ఈ రెడ్ బుక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం నలిగిపోతోందన్నారు. అందుకు నిదర్శనం తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే అని, ఇలాంటి ఎన్నికలు తాము ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని, ఈ ఎన్నికల్లో సాక్ష్యాత్తూ పోలీసులే కిడ్నాప్‌లకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు.
చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా లేదంటే ట్యాంపరింగ్ చేస్తే గెలిచారా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారని, ఇది ఈవీఎం ప్రభుత్వం అని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఎన్నికల్లో గెలిచారని, అందుకే ఈ ప్రభుత్వం నిరంతరం అభద్రతాభావంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే గెలుపొందడానికి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కూటమికి అభ్యర్థులు లేకపోయినా అప్రజాస్వామికంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వైసీపీ నేతలను భయపెట్టి, ప్రలోభపెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవాలని ఈ ప్రభుత్వానికి లేదన్నారు.